జాతీయ స్థాయిలోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు నిర్వహించే సెమిస్టర్ పరీక్షలు, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను యూజీసీ ఆమోదించింది. సోమవారం ఢిల్లీలో జరిగిన పాలక మండలి సమావేశంలో నిపుణుల కమిటీ నివేదికలను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు యూజీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే నూతన విద్యా సంవత్సరాన్ని కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని యూజీసీ ప్రతిపాదించింది. డిగ్రీ, పీజీతో పాటు ఇతర కోర్సులకు సంబంధించి చివరి సంవత్సరం సెమిస్టర్ పరీక్షలను సెప్టెంబర్ చివరి వారంలో జరపాలని ప్రతిపాదించింది.
ఈ పరీక్షలను ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వారా నిర్వహించాలని సూచించింది . పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు బ్యాక్ లాగ్ సబ్జెక్టుల పరీక్షలను జరపాలని సూచించింది. ఒకవేళ ఏదైనా కారణంతో చివరి సెమిస్టర్ పరీక్షలకు హాజరు కాలేకపోయిన విద్యార్థులకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరింది. ఈ ప్రయోజనం 2019-20 విద్యా సంవత్సరానికే పరిమితమని స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ సెమిస్టర్, సంవత్సర పరీక్షలకు సంబంధించి ఏప్రిల్ 29న జారీ చేసిన మార్గదర్శకాలు యధాతధంగా అమలవుతాయని తెలిపింది.
2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు, అకాడమిక్ క్యాలెండర్‌కు సంబంధించి ఏప్రిల్ 29న జారీ చేసిన మార్గదర్శకాల స్థానంలో కొత్త వాటిని ప్రకటించినట్టు యూజీసీ తెలిపింది.
కేంద్రహోంశాఖ గ్రీన్ సిగ్నల్ : పరీక్షల నిర్వహణ విషయంలో సందిగ్ధతపై కేంద్ర హోంశాఖ స్పష్టత ఇచ్చింది. యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో పరీక్షల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. యూజీసీ నిబంధనల ప్రకారం చివరి సెమిస్టర్ పరీక్షలను నిర్వహించడం తప్పనిసరి కావడంతో ఈ మేరకు పరీక్షలకు అనుమ తిస్తున్నామని పేర్కొంది. విశ్వవిద్యాలయాలు అకడ మిక్ క్యాలెండర్ ను అమలు చేయాల్సి ఉంటుందని,
వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ సిఫారసు మేరకు దేశం లోని అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు పరీక్షలు జరపవచ్చని హోంమంత్రిత్వ శాఖ వివరించింది.